యెమెన్‌లో మరణశిక్షకు గురైన కేరళ నర్సు నిమిష ప్రియ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న Save Nimish Priya International Action Council బృందానికి యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. భద్రతా సమస్యలు, యెమెన్ ప్రభుత్వంతో భారత్‌కు ఉన్న పరిమిత సంబంధాల కారణంగా ఇది సాధ్యపడదని కేంద్రం వెల్లడించింది. సుప్రీంకోర్టు ఈ బృందానికి అనుమతించాలంటూ కేంద్రానికి ఆదేశాలు ఇచ్చినా.. కేంద్రం భద్రతను ప్రాముఖ్యతనిస్తూ వెనకడుగు వేసింది.
నిమిష ప్రియను రక్షించేందుకు ఈ బృందం మొదటి నుంచి న్యాయపరంగా, మానవతావాదంగా కృషి చేస్తోంది. ఆమె కుటుంబానికి అవసరమైన Legal support అందిస్తోంది. గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి.. అధికారిక మార్గాలతో పాటు అనధికారిక మార్గాలు కూడా పరీక్షించాలంటూ కోర్టు సూచించగా, కేంద్రం మాత్రం ఇది చాలా ప్రమాదకరమని స్పష్టం చేసింది. ప్రస్తుతం యెమెన్ రాజధాని సనా పరిస్థితులు ఎంతో దుర్భరంగా ఉన్నాయని, అందుకే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని రియాద్‌కు మార్చామని పేర్కొంది.

నిమిష ప్రియ 2008లో ఉద్యోగ నిమిత్తం యెమెన్ వెళ్లి అక్కడే స్థిరపడింది. 2011లో కేరళకు వచ్చి వివాహం చేసుకున్న ఆమె తిరిగి యెమెన్ వెళ్లి వ్యాపార ప్రారంభించింది. అయితే వ్యాపార భాగస్వామిగా చేసిన తలాల్ అదిబ్ మెహది ఆమెను ఆర్థికంగా, మానసికంగా వేధించాడు. అతడిపై ఫిర్యాదు చేసినా యెమెన్ పోలీసులు స్పందించకపోవడంతో, ఆమె 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నంలో అతడు మృతిచెందాడు. తర్వాత ఆమె అరెస్టు అయ్యింది. ట్రయల్ కోర్టు 2020లో, యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ 2023లో మరణశిక్ష ఖరారు చేసింది.
ఇకపోతే, బ్లడ్మనీ అనే పరిహార విధానం ద్వారా ఆమెను కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది హత్య కేసుల్లో బాధిత కుటుంబానికి నేరస్తుల కుటుంబం ఇచ్చే ధనపరిహారం. బాధిత కుటుంబం అంగీకరిస్తే శిక్ష నుంచి విముక్తి లభించే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా వ్యక్తిగత ఒప్పందంపై ఆధారపడే వ్యవహారమే కావడంతో, కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేసింది. ఈ కేసు పరిణామాలపై కేంద్రం తాజాగా విదేశీ మిత్రదేశాలతో సంపర్కంలో ఉన్నామని ప్రకటన చేయడం గమనార్హం.